ఉప ఎన్నికల్లో తేల్చుకుంటా ..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: దానం నాగేందర్

ఉప ఎన్నికల్లో తేల్చుకుంటా ..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: దానం నాగేందర్
  • మళ్లీ పోటీ చేసి గెలుస్తా.. ఏ పార్టీ నుంచి అనేది టికెట్ వచ్చాక చెప్తా

హైదరాబాద్‌‌, వెలుగు: తన అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌‌లో విజయం తనదేనని అన్నారు.

ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది పార్టీ టికెట్ వచ్చిన తర్వాత చెప్తానన్నారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు తాను ఏదైతే ఊహించానో ఇప్పుడు అదే జరిగిందని దానం అన్నారు. న్యాయపోరాటంలో చివరి వరకు ప్రయత్నించానని చెప్పారు. తాను ప్రజల మనిషినని, ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ప్రభావం ఎన్నికల్లో ఏమాత్రం ఉండబోదన్నారు.

అభివృద్ధి కోసమే పార్టీ మారా..

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశానని దానం చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌‌లో చేరానన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ప్రజల మద్దతు తనకు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్‌‌రెడ్డిని తాను కలవలేదని, ప్రస్తుతం గణేశ్ నిమజ్జనం పనుల్లో ఉన్నానని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌‌రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు చురుకైన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని దానం ఆరోపించారు. దాని ప్రభావం ఖైరతాబాద్‌‌లో కొంత ఉంటుందన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి చొరవతో కర్నాటక నుంచి జూరాలకు నీరు వస్తోందన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు.